Free SMS And Earn Part Time Money







9/7/09

జొష్ లో లేని డోస్ కిక్ ఎక్కలేదు కలక్షన్ దక్కలేదు


dilraju first average film with big star son
'జోష్' సినిమా ద్వారా మరో స్టార్ హీరో నటవారసుడు
తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున తనయుడు నాగచైతన్య, నిన్నటి తరం ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కార్తిక లను పరిచయం చేస్తూ వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ ఎట్టకేలకు సెపెంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున నటవారసుడిని పరిచయం చెయ్యబోతున్న చిత్రంగా భారీ అంచనాలతో ఈ చిత్రం విడుదలైంది. ప్రేక్షకులను ఓ మోస్తరుగా సంతృప్తి పరచిన ఈ చిత్రం యావరేజీ చిత్రంగా నిలబడుతుంది.

కథ విషయానికొస్తే సత్య(నాగచైతన్య) వైజాగ్ లో డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు. ఓ రోజు తన తల్లితండ్రులతో కాలేజీ మానేస్తున్నానని చెప్పి, ఉద్యోగం కోసం హైదరాబాదు వస్తాడు. తన మామయ్య (సునీల్) తో కలసి వుంటూ ఓ నర్సరీలో ఉద్యోగం చేస్తూ వుంటాడు. అనుకోకుండా విధ్య(కార్తిక) అనే స్కూల్ టీచర్ ను కలుస్తాడు. విధ్య ఎప్పుడూ కాలేజీకి వెళ్లాలని కలలుకంటూ వుంటుంది. కానీ తనని కాలేజీకి పంపడం ఆమె అన్నయ్యకు ఇష్టం వుండదు. కాలేజీకి వెళ్తే తన చెల్లెలు భద్రంగా వుండదని అతని అభిప్రాయం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది.

ఇదిలా వుంటే ఓ సారి సత్య యంజియం కళాశాల విధ్యార్థులతో గొడవపడతాడు. కానీ ఆ విధ్యార్థులకు జెడి(జెడి చక్రవర్తి) అనే రాజకీయనాయకుడి అండదండలు మెండుగా వుంటాయి. జెడి విధ్యార్థులని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ వుంటాడు. దీంతో ఆ విధ్యర్థులను మార్చాలనుకున్న సత్య వారి కాలేజీలోనే చేరతాడు. ఇక మిగిలిన కథ సత్య ఎలా ఆ విధ్యార్థులను జెడి మాయ నుండీ బయటకు తీసుకొచ్చి, జెడి ఆట కట్టించాడు అనేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే చైతన్య తొలి చిత్రమైనా బాగానే చేసాడు. డాన్సుల్లో, డైలాగులు చెప్పడంలో తన ప్రతిభని చూపాడు. కానీ తన బాడీల్యాంగ్వేజ్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. కొన్ని సన్నివేశాల్లోని నటనలో
నాగార్జున ని తలపిస్తాడు. యాక్షన్ హీరోగా కన్నా రొమాంటిక్ హీరోగా బాగా సరిపోతాడు. అప్పీరియన్స్ బాగానే వున్నా ఇంకా టీనేజర్ గానే కనిపించాడు. కథానాయిక కార్తిక చెప్పుకోదగ్గ అందగత్తె కాకపోయినప్పటికీ నటనలో పర్వాలేదనిపించుకొంది. 'పక్కింటి అమ్మాయి' తరహా పాత్రలో నటించిన ఆమె త్ర రూపకల్పన బొమ్మరిల్లులో హాసిని పాత్రను పోలి వుంటుంది. ఇక విలన్ గా జెడి చక్రవర్తికి ఇలాంటి పాత్రలు అందెవేసిన చెయ్యి. ఆయన పాత్ర 'శివ' చిత్రంలో భవానీ పాత్రకు కొనసాగింపుగా వుంటుంది. ప్రిన్సిపల్ గా ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే బాగా చేసాడు. సునీల్ కామెడీ చెప్పుకోదగినదిగా లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు ప్రేక్షకులను నవ్విస్తాడు. బ్రహ్మానందం పాత్ర వృధాగా పోతుంది. ఇంతకు ముందు కథానాయకుడిగా, హీరో స్నేహితుడిగా నటించిన ఆనంద్ ఈ చిత్రంలో చైతన్య తండ్రిగా నటించాడు. చాలా రోజుల తర్వాత సితార కథానాయకుడి తల్లి పాత్రలో నటించింది. హేమ, సూర్య లు తమ పాత్రలకు న్యాయం చేసారు.

దర్శకుడు వాసువర్మ సందేశాత్మకమైన కథను ఎన్నుకున్నప్పటికీ ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమయ్యాడు. హీరో ఫ్లాష్ బ్యాక్ కన్వింసింగ్ గా లేదు. సందేశం చెప్పడానికే సినిమాను సాగదీసినట్టనిపిస్తుంది. సందీప్ చౌతా అందించిన సంగీతం ఫర్వాలేదు. రెండు పాటలు బాగున్నాయి. సమీర్
రెడ్డి సినిమాటోగ్రఫీ ఫర్లేదు.

మొత్తానికి సినిమా పేరులో మాత్రమే జోష్ వుంది కానీ సినిమా మాత్రం చాలా సాదాసీదాగా వుంటుంది. నాగచైతన్య కోసం ఓపెనింగ్స్ బాగానే వచ్చినా హిట్ రేంజ్ ను చేరుకోవడం కష్టమే. ఓ మోస్తరు చిత్రంగా నిలబడుతుంది.

Powered by web analytics software.