ప్రముఖ సినీ నిర్మాత డీవీఎస్ రాజు శనివారం వేకువ జామున కన్నుమూశారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. డీవీఎస్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో జన్మించిన రాజు అనేక హిట్ చిత్రాలను నిర్మించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ముఖ్యంగా 60 - 70 దశకాల్లో నటరత్న ఎన్టీఆర్ హీరోగా "ధనమా...? దైవమా..?" చిత్రంతోపాటు గండికోట రహస్యం, మంగమ్మ శపథం, పిడుగు రాముడు వంటి చిత్రాలను నిర్మించారు.
నేషనల్ ఫిలిమ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సుదీర్ఘకాలంపాటు పనిచేశారు. అంతేకాదు కొన్ని సినిమాల్లో ఆయన అతిథి పాత్రలలో కూడా నటించారు. ఆయన నిర్మించిన "జీవన జ్యోతి" చిత్రానికి బంగారు నంది అవార్డు దక్కింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గాను 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డుతో సత్కరించింది.
కాగా డీవీఎస్ రాజు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పరిశ్రమలోని ప్రముఖులు అన్నారు. మంచి నిర్మాతను, గొప్ప వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందని అన్నారు.