ట్రెండ్‌లో యూత్ చిత్రాలకు ఆదరణ ఎక్కువగా లభిస్తుండటంతో ఆ తరహా చిత్రాల నిర్మాణానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆ కోవలో రూపొందుతున్న చిత్రం 'తేజం'. ఇందులో ఎనిమిది మంది కొత్త హీరోలు నటించారు. సన్‌రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజ్.కె.ఎన్.గోపి దర్శకత్వంలో ఎస్.రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకుంటోంది. యూత్ చిత్రమైనప్పటికీ, చక్కటి కథాబలంతో దీనిని రూపొందించామని నిర్మాత రాజశేఖర్ వెల్లడించారు. ఇటీవల మైత్రీ సంస్థ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. గణ సంగీతం ప్రతిఒక్కరినీ అలరింపజేస్తుందని అన్నారు. ఆడియో హిట్ కావడం చిత్ర విజయానికి ముందస్తు సంకేతమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. సామాజిక స్పృహతో తీసిన చిత్రమిదని, ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని చెప్పారు. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
దర్శకుడు రాజ్.కె.ఎన్.గోపి మాట్లాడుతూ, 'కథను నమ్ముకునే ఈ సినిమాను చేశాం. ఇంకా చెప్పాలంటే కథే హీరో. నిర్మాత ఇచ్చిన సహకారమే చిత్రం బాగా వచ్చేందుకు దోహదం చేసింది. హీరోలు కొత్తవారైనా తమ పాత్రలకు పూర్తి న్యాయంచేకూర్చారు. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అని చెప్పారు.
ఈ చిత్రంలో సర్ధార్ పటేల్, సురేష్, మహేష్, వినోద్, వివేక్, ఆర్.జె.రాజు, గౌతమ్, జయవర్దన్ ప్రధాన పాత్రలు పోషించగా, మోనీషా కథానాయికగా నటించింది. ఇతర పాత్రలను బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, కిషోర్‌దాస్ తదితరులు పోషించారు.
: తెలుగు ప్రేక్షకుల టేష్ట్ ని పరీక్షించబొతున్న క్రేజి చిత్రాలు