రాష్ట్ర రాజకీయాలు అమెరికా తెలుగువారిలో కూడా చిచ్చును పెట్టాయి. ఈ రాజకీయ అంతర్గత కలహాలు బయటపడి సజావుగా సాగుతున్నతానా మహా సభలను రసాభాసగా మార్చాయి. ఈ పుణ్యం కట్టుకున్నది కూడా ఇక్కడి నుంచి సభలకు ప్రముఖులుగా, చుట్టపు చూపుగా వెళ్ళిన మన రాజకీయ నాయకులే కావడం విశేషం. ఇక్కడ నోటి మాటలతో విమర్శలు చేసుకోడానికి అలవాటైపోయిన ఈ నాయకుల వల్ల తానా సభలో తెలుగువారుఐక్యతను ఒక్కసారిగా మరచిపోయి గ్రూపులుగా ఏర్పడి కాలర్లు పట్టుకోడానికి కూడా సన్నద్ధమైపోయారు. గత మూడు రోజులుగా తానా సభలకు వచ్చిన తెలుగువారి మధ్య రాజకీయ అహంకారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. చిన్న చిన్ని కీచులాటలు జరుగుతున్నా సర్దకుపోతూ, తానా సంబరాల్లో సరదాగానే గడిపారు. కాని చివరి రోజున నిర్వహించిన పొలిటికల్ ఫోరం మాత్రం ఈ పొగలను సెగలుగా మార్చేసింది. చివరకు మంత్రి గల్లా అరుణ కుమారి జోక్యం చేసుకుని సున్నితమైన భాషలో కఠన వాస్తవాలు చెబుతూ మందలించేంత వరకూ తానా సభకు వచ్చిన తెలుగువారు చల్లారలేదు.