11/17/10
Raktacharitra సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా.
రక్త చరిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వైయస్సార్ ను మించిన నాయకుడు దేశంలోనే లేడని వైయస్ జగన్ వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో వర్మ కామెంట్స్ వారికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. వైయస్సార్ ఎవరంటూ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడంపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. రక్త చరిత్ర -2లో వైయస్ పాత్ర ఉంటుందా అని మీడియా ప్రతినిధులు అడిగితే ఆయనెవరంటూ వర్మ వ్యంగ్యంగా ప్రశ్నించారు. దీనిపై వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు తీవ్రంగా మండిపడ్డారు. వర్మకు చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య ఎవరో కూడా తెలిసి ఉండకపోవచ్చునని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన గొప్ప నాయకులు తెలియనప్పుడు వర్మతో ప్రయోజనం ఏమిటని ఆయన అడిగారు. రక్తచరిత్ర -1లో స్వర్గీయ ఎన్టీ రామారావు పాత్రపై తీవ్ర వివాదం చెలరేగింది. అదే సమయంలో రెండో భాగంలో ఎవరెవరి పాత్రలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు సంబంధించిన అంశాన్ని వర్మ ఎలా చూపిస్తాడనేది ఆసక్తిగా మారింది. పరిటాల రవి హత్యకు కుట్ర జరుగుతోందని, ఆయనకు భద్రత కల్పించాలని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో శాసనసభలో అడిగారు. దీనిపై తీవ్ర వివాదం కూడా చెలరేగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే పరిటాల రవి హత్య జరిగింది. మద్దెలచెర్వు సూరిని వైయస్సార్ ప్రోత్సహించారని, అందులో భాగంగానే పరిటాల రవి హత్య జరిగిందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. దీనివల్ల వైయస్సార్ పాత్ర ఉంటుందా, ఉంటే ఎలా ఉంటుందనేది మీడియా ప్రతి రోజూ ఏదో రూపంలో స్పెక్యులేట్ చేస్తూ ఉన్నది. రక్తచరిత్ర-1లో శుభలేక సుధాకర్ పోషించిన పాత్ర ఎవరిదనేది కూడా ఆసక్తిగా మారింది. సినిమాలోని పెద్దాయన కోట్ల విజయభాస్కర రెడ్డా, వైయస్ రాజశేఖర రెడ్డా అనేదానిపై కూడా చర్చ సాగుతూనే ఉన్నది. వైయస్సార్ కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాత్ర కూడా రక్తచరిత్ర-2లో ఉంటుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఊహాగానాల నేపథ్యంలో వర్మ తన సినిమా విడుదలను వాయిదా వేశారు. ఆ వాయిదాపై కూడా పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొదటి భాగంలోని పాత్రల వల్ల వచ్చిన వివాదాలు రాకుండా చూసుకోవడానికి సినిమాను రీషూట్ చేస్తున్నారా, రీఎడిటింగ్ చేస్తున్నారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వివాదాల నుంచి బయటపడడానికి అది కల్పిత కథ అని వర్మ చెప్పుకుంటున్నా ఫలితం ఉండడం లేదు. ఏమైనా, రక్తచరిత్ర -2 కూడా రాజకీయవర్గాల్లో సంచలనాన్ని సృష్టిస్తుందా అనేది వర్మ ఎంత కాలం సస్పెన్స్ గా ఉంచుతారనేది చూడాలి
Powered by web analytics software. |