12/24/10
త్రిష తమ నటన, గ్లామర్ తో లాగుదామని చూసినా భారమైపోయింది.
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: లక్ష్మి గణపతి ఫిల్మ్స్,రెడ్ జెయింట్ ఫిల్మ్స్
తారాగణం: కమల్ హసన్, త్రిష, మాధవన్, సంగీత, రమేష్ అరవింద్, ఊర్వశి తదితరులు.
కధ: కమల్ హసన్, క్రేజీ మోహన్
మాటలు: వెన్నెలకంటి
ఎడిటింగ్: షాన్ మహ్మద్
కెమెరా: మానుష్ నందన్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత: ఉదయనిది స్టాలిన్
దర్శకుడు: కె.ఎస్.రవికుమార్
విడుదల తేది: 23/12/2010
కమల్ హాసన్ కామిడి అనగానే తెనాలి, పంచతంత్రం, భామనే సత్య భామనే, మైఖల్ మదన కామరాజు వంటి చిత్రాలు వరసగా గుర్తొచ్చి మనస్సుకు చెక్కిలిగిలి పెడతాయి. దాంతో కమల్ కొత్త కామిడీ చిత్రం వస్తోందనగానే నవ్వటానికి రెడీ అయ్యిపోయి ధియోటర్లలో వాలిపోయారు అభిమానులు. అయితే కమల్ సొంతంగా కథ, స్క్రీన్ ప్లే అందిచిన ఈ చిత్రం ఆ విభాగాలే లోపమై వారి ఎక్సపెక్టేషన్స్ ను కొంచెం కూడా రీచ్ కాలేక చతికిలపడింది. కమల్, త్రిష తమ నటన, గ్లామర్ తో లాగుదామని చూసినా భారమైపోయింది.
మేజర్ గా రిటైరైన ఆర్ భూషణ్ (కమల్ హాసన్) డిటెక్టివ్ గా పనిచేస్తూంటాడు. వృత్తిలో భాగంగా అంబుజాక్షి ఉరఫ్ నిషా(త్రిష)నిఘా వేయటానికి ప్యారిస్ వస్తాడు. ఆ కేసుని అప్పచెప్పింది ఎవరో కాదు...నిషా ప్రేమికుడు మదన్ గోపాల్(మాధవన్). హీరోయిన్ అయిన నిషా తోటి ఆర్టిస్టుతో చనువుగా మెలగటాన్ని అనుమానించిన మదన్ ఆమెతో విడిపోయి..ఎఫైరుందని నిరూపించాలని ఈ డిటెక్టివ్ ద్వారా ప్రయత్నిస్తూంటాడు. నిషాకు ఏ విధమైన ఎఫైర్ లేదని తెలుసుకున్న భూషణ్ ఈ విషయమే మదన్ పాస్ చేస్తాడు. అయితే బిజెనెస్ మ్యాన్ అయిన మదన్ అతి తెలివితో ఆమెకు ఎఫైర్ లేదన్నప్పుడు...ఇక నీ పని లేదు కదా అంటూ ఫీజ్ ఎగ్గొట్టబోతాడు. ఆ ఫీజ్ తో ఓ ప్రాణాన్ని నిలబెట్టాల్సి ఉండటంతో మదన్ రివర్స్ గేమ్ ఆడి..మదన్ కి బుద్ది చెప్పాలనుకుంటాడు. నిషా కు ఓ ఎఫైర్ ఉన్నట్లు డౌట్ మదన్ లో క్రియోట్ చేసి డబ్బులు లాగుతాడు. అప్పుడు మదన్ ఎలా రియాక్ట్ అయ్యాడు. నిషా పరిస్ధితి ఏమైంది, నిషాతో ప్యారిస్ వచ్చిన స్నేహితురాలు దీప్తి(సంగీత)కి ఈ కథకీ సంభంధం ఏమిటీ అన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రం చివరిదాకా చూడాల్సిందే.
దేరీజ్ సమ్ ధింగ్ ఎబౌట్ మేరి(1988) చిత్రాన్ని కేవలం ప్రేరణగానే తీసుకున్న ఈ చిత్రానికి మొదట చెప్పుకున్నట్లుగా కథ,స్క్రీన్ ప్లే నే మైనస్ గా నిలిచి సెకెండాఫ్ ని నసగా మార్చేసాయి. అందులోనూ సినిమా మొదటనుంచీ చివరి వరకూ కమల్ హాసన్..తన బాస్ మాధవన్ తోనూ, తన స్నేహుతుడు తోనూ ఫోన్ లో మాట్లాడుతూ కథ నడుపుతూండటం బోర్ ఎపిసోడ్ లా మారింది. అందులోనూ డిటెక్టివ్ గా చేసిన కమల్ పాత్రకు మొదట్లో తనను నియమించిన వాడు డబ్బు ఎగ్గొట్టడానికి ప్రయత్నించటంతో సమస్యలో పడుతుంది. ఆ తర్వాత తను తన అవసరం కోసం త్రిషకు వేరే వ్యక్తితో రిలేషన్ ఉందని అబద్దం ఆడినప్పుడు అక్కడనుంచి ఆ అబద్దం పెరిగి పెద్దదై కమల్ నే సమస్యలో పడేస్తే కామిడీ బాగా పండేది. కానీ కమల్ అబద్దం ఆడటం వల్ల ఎవరికీ పెద్ద నష్టం కలిగినట్లుందు. అలాగే తను ఆడిన అబద్దం ద్వారా మరింత విడిపోయిన జంటను కలుపుదామని కూడా కమల్ ప్రయత్నించడు. అలా చేసుంటే సెకెండాఫ్ లో పాత్రల మధ్య సంఘర్షణ పుట్టి రాకుండా కామిడీ పండి ఉండేది.
ఇక ఈ చిత్రంలో నీలాకాశం పాటను ఫ్లాష్ బ్యాక్ వేస్తూ రివర్స్ లో చేసిన చిత్రీకరణ ఐడియా ఈ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చాలా డల్ గా ఉంటాయి. దర్శకత్వ పరంగా ఫస్ట్ హాఫ్..గౌతమ్ మీనన్ దర్శకత్వ శైలిలో స్మూత్ గా సాగుతుంది. నటీనటుల్లో కమల్ ఎప్పుడూ నిరాశపరచడు అన్నది ఈ సారి నిజం అనిపించదు. త్రిష తన రెగ్యులర్ స్మైల్స్, ఎక్సప్రెషన్స్ తో నటించుకుంటూ పోయింది. డైలాగులు చాలా చోట్ల అచ్చ తెలుగులో రాయాలని ప్రయత్నించటం కొద్దిగా తేడాగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో హైలెట్ ఏదన్నా ఉందంటే అదే కెమెరా పనితనం.
ఫైనల్ గా ఈ చిత్రం టైటిల్, కమల్, త్రిషలని చూసి ఓ అధ్భుతమైన రొమాంటిక్ కామిడీ అని ఊహించుకుని వెళితే తీవ్రమైన నిరాశ కలుగుతుంది. అయితే కమల్ హాసన్ ఓ చిత్రాన్ని డైరక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూద్దామనుకున్నవారు మాత్రం ఈ చిత్రం తప్పక చూడాలి. ఎందుకంటే ఆర్టిస్టుల ఎక్సప్రెషన్ దగ్గర్నుండి...అన్నీ కమల్ హాసనే స్వయంగా నిర్ధేసించినట్లు ఈ చిత్రం చూసిన ఎవరైనా చెప్పగలుగుతారు.
Powered by web analytics software. |