Free SMS And Earn Part Time Money







1/14/11

గ్రాఫిక్స్‌ మాయాజాలమే "అనగనగా ఓ ధీరుడు:Review


నటీనటులు: సిద్దార్థ్‌, శృతి హాసన్‌, లక్ష్మీప్రసన్న, తనికెళ్ళభరణి, రవిబాబు, బేబీ హర్షిత తదితరులు, బ్యానర్‌: వాల్ట్ డిస్నీఅండ్‌ అడోబ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ దేవినేని, ప్రకాష్‌ కొవెలమూడి, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, దర్శకుడు: ప్రకాష్‌ కోవెలమూడి.


పాయింట్‌: ప్రేతాత్మకు దైవశక్తికి మధ్య జరిగిన పోరాటమే... వాల్ట్‌డిస్నీ చిత్రమంటేనే పిల్లల చిత్రమని తెలిసిపోతుంది. రిలీజ్‌కు ముందు నిర్మాతలు కూడా ఇదే చెప్పుకొచ్చారు. ఒక చందమామ కథలా, డిస్నీఛానల్‌లో వస్తున్న ప్రోగ్రామ్స్‌లాగా ఈ చిత్రం అనిపించడం విశేషం. సిద్దార్థ ధీరునిగా బాగున్నా... గుడ్డివాడిగా మాయలు, మంత్రాలు తెలిసినవారిని ఎదుర్కోవడం అతకలేదు. శృతిహాసన్‌ పాత్ర గ్లామర్‌కే ఉపయోగించారు. మంచు లక్ష్మీప్రసన్న ప్రేతాత్మగల మంత్రగత్తెగా అలరించినా, ఓవర్‌యాక్షన్‌ చేసినట్లుగా ఉంది. టోటల్‌గా కథాగమనంలో ఫీల్‌ కలగకపోవడం చిత్రానికి మైనస్‌. పిల్లల్ని టార్గెట్‌గా చేసుకుని తీసినది ఈ చిత్రం కథ: కాలం తెచ్చిన మార్పుల్లో చరిత్ర పుటల్లో చెరిగిపోయిన ఓ రాజ్యం అంగరాజ్యం. నీటిబిందువు ఆకారంలో ఉన్న ఆ రాజ్యంలో ఐరేంద్రి(లక్ష్మీ మంచు) ప్రేతాత్మరూపంలో సర్పకన్యగా వస్తుంది. అక్కడి ప్రజల్ని నానారకలుగా హింసించి రోగగ్రస్తుల్ని చేస్తుంది. ఈ దుష్టశక్తి ఆటకట్టించాలంటే దివ్య పర్వతాల్లో ముని సంరక్షణలో ఉన్న మోక్ష అనేబాలిక వల్లే అవుతుందని తెలుసుకున్న ఓ వ్యక్తి ఆమెకోసం బయలుదేరతాడు.

అక్కడ ఆమెను రక్షిస్తూ వుండే యోధ(సిద్దార్థ) ధీరుడుని ముని కాపలాగా పెడతాడు. కానీ అతను గుడ్డివాడు. అయినా శబ్దసాయంతో ఎంతటివారినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. సర్పకన్యకు టానిక్‌లా అప్పుడప్పుడు పోయిన శక్తిని కూడదీసుకోవాలంటే రక్తం తాగాలి. ఆ రక్తం తనకు సరిపోయే ప్రియ(శృతిహాసన్‌)ను బంధించి రోజుకూ కొద్దికొద్దిగా తాగుతుంటుంది. అయినా తృప్తిచాలక ఇంకా ఎన్నాళ్ళు తన ఆత్మ ఉన్నంతకాలం కావాలంటే ఒక్కటే మార్గం. దైవశక్తులున్న మోక్షరక్తం తాగితే చాలు ఎప్పుడూ శక్తివంతంగా ఉంటుందని తెలుసుకుని మోక్షకోసం తన అనుచరుల్ని పంపుతుంది. అక్కడ మోక్షకోసం వెళ్ళిన వ్యక్తి మునికి పరిస్థితి వివరించి అంగరాజ్యానికి తీసుకు వస్తుంటాడు. ఇక్కడ సర్పకన్య ఆజ్ఞమేరకు ఆమె అనుచరులు బయలుదేరి వారిని పట్టుకుంటారు. అప్పుడు యోధునిగా సిద్దార్థ ఎలా కాపాడాడు? అసలు తనకు కళ్లు ఎలాపోయాయి? అనేది సినిమా.

ఆద్యంతం ఉత్కంఠను కల్గించే చిత్రాల కోవలోకి ఇది వస్తుంది. కానీ అంతటి ఉత్కంఠ ఎక్కడా కన్పించదు. పెరిగిన టెక్నాలజీ రీత్యా గ్రాఫిక్స్‌ అంతా మాయచేసి కాస్త ఓవర్‌గా ఉది. యోధునిగా సిద్దార్థ నటనలో సీరియస్‌నెస్‌ లేదు. ఏదో సరదాగా చిన్నపిల్లల సినిమాకు చేసినట్లు చేశాడు. మాడ్యులేషన్‌ సాంఘిక చిత్రాలవలే ఉంటుంది.
అంగరాజ్య పూజారిగా తనికెళ్ళభరణి అస్సలు సూట్‌కాలేదు. పూర్వీకుల నుంచి దక్కిన మాయల మంత్రాలతో శృతిహాసన్‌ ట్రీట్‌మెంట్‌లో అంగాంగ ప్రదర్శనలు ఎక్కువగా ఉన్నాయి. సర్పకన్య సేనానిగా రవిబాబు పాత్ర కాస్త హాస్యాన్ని పండిస్తుంది. మిగిలిన పాత్రలు కథలో భాగాలే అయినా గుర్తుపెట్టుకునేట్లుగా ఉండవు.

ప్రత్యేకంగా చెప్పాల్సింది ఆర్ట్‌ పనితనం, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ తీరు అద్భుతమనే చెప్పాలి. ఊహా లోకంలో విహరించే ఆహ్లాదమైన జలపాతాలు, కొండలు, కోనలు చాలా బాగున్నాయి. సర్పకన్యగా ఆమెను రక్షించే వెంట్రుకలే సర్పాలుగా మారి మాట్లాడేవిధానం బాగుంది. పాటలు చిత్రానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేవు. కొన్ని సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. టోటల్‌గా పరిశీలిస్తే... హ్యారీపోటర్‌ లాంటి చిత్రాల్లో ఇవే టెక్నాలజీ ఉపయోగించినా అందులో కథాబలం కొంత ఆకట్టుకుంటుంది. పాత్రల తీరు ఇంట్రస్ట్‌గా ఉంటుంది. ఈ చిత్రానికి అవే లోపించాయి. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాల్సిందే.
Powered by web analytics software.