ఐపీఎల్ తరహాలో మన తారలంతా కలిసి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) పేరుతో క్రికెట్ ఆడబోతున్న విషయం తెలిసిందే. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషలకు చెందిన నాలుగు జట్లు ఈ పోటీలో పాల్గొంటాయి. అంతకంటే ముందు మార్చి 5న సౌత్ సూపర్‌స్టార్స్ - ముంబయి హీరోస్ మధ్యన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ విశాఖపట్టణంలో నిర్వహించబోతున్నారు. దక్షిణాది జట్టుకు వెంకటేష్ నాయకత్వం వహిస్తారు. ముంబయి హీరోస్ జట్టుకి సల్మాన్‌ఖాన్ కెప్టెన్. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ ''ఈ మ్యాచ్ 20-20 తరహాలో ఉంటుంది. ఇది కేవలం సరదాగా సాగే మ్యాచ్. అసలు ఆట జూన్‌లో ఉంటుంది. సినిమా నటులు ఎక్కువ మంది క్రికెట్ అంటే ఇష్టపడుతున్నారు. అందుకే క్రికెట్ మ్యాచ్‌నే ఎంచుకున్నాం'' అన్నారు. భారత్- ఇంగ్లాడ్‌ల మధ్య ఆదివారం జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ ఎలా ఉందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ''మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. ప్రపంచకప్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌లో 350 స్కోరు చేస్తేగానీ విజయం దక్కేలా లేద''ని చెప్పారు. ''ఈ పోటీల కోసం ఇంకా ప్రాక్టీస్ మ్యాచ్‌లు మొదలుపెట్టలేదు. కానీ ఎవరికి వారు ప్రాక్టీస్ చేస్తున్నార''న్నారు తెలుగు టీమ్ యజమాని, హీరో మంచు విష్ణు. సౌత్ సూపర్‌స్టార్స్ జట్టులో సూర్య, సుదీప్, విష్ణు, సిద్ధార్థ్, శరత్ కుమార్, తరుణ్ తదితరులు ఆడతారు. శ్రియ, ప్రియమణి, తాప్సి, సమంత టీమ్ ప్రచారకర్తలుగా ఉంటారు